Ram Madhav
April 23, 2020

కరోనావైరస్: ‘చైనాలో అధికార సంఘర్షణ రావొచ్చు… కొత్త ప్రపంచ వ్యవస్థలో భారత్‌ది ముఖ్య పాత్ర’ – అభిప్రాయం

Getting your Trinity Audio player ready...

నూట పదేళ్ల క్రితం అమెరికా, యూరప్, వాటి వలస రాజ్యాలకు వెళ్లేందుకు వీసాలు, పాస్‌పోర్ట్‌లు ఏవీ ఉండేవి కావు. కానీ, ఆ తర్వాత వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధంతో పరిస్థితులు మారిపోయాయి. దేశాలు మూసుకుపోయాయి. వాటి సరిహద్దులు బలపడ్డాయి.

ఆ తర్వాత ఆర్థిక మందగమనం, మాంద్యం వచ్చాయి. జాతీయవాదం అతిజాతీయవాదంగా మారి మరో ప్రపంచ యుద్దానికి దారితీసింది. అనంతరం దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన, ఆధారపడ్డ, సంస్థాగతమైన అంతర్జాతీయ వ్యవస్థను మనం నిర్మించుకున్నాం. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, 75 ఏళ్లుగా ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతోంది.

కానీ, ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి ఆ వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే ముప్పును తెచ్చింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలు మూసుకుపోయి, నియంతృత్వ ధోరణికి వెళ్లినట్లుగానే… ఇప్పుడు కూడా మరింత మూసుకుపోయిన, సంకుచిత జాతీయవాద ప్రపంచం ఏర్పడొచ్చని కొందరు రాజకీయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్లోబలైజేషన్, స్వేచ్ఛా వాణిజ్యం తగ్గిపోతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

‘చైనాపై అనుమానాలు’

ఈ ప్రతికూల వైఖరి ఎక్కడి నుంచి పుట్టుకువచ్చింది? కేవలం 0.125 మైక్రాన్ల సైజు, అంటే కను రెప్ప వెంట్రుక మందంలో వెయ్యో వంతు కన్నా తక్కువ ఉండే కరోనావైరస్ వల్ల వచ్చిందా?

కాదు, ఒక్క వైరస్ వల్ల కాదు. శక్తిమంతమైనవిగా భావించే రెండు దేశాలు ఇప్పుడు మొత్తం ప్రపంచపు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి.

హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన అమెరికన్ చరిత్రకారుడు నయల్ ఫెర్గసన్ వాటికి ‘చిమెరికా’ అని పేరు పెట్టారు.

దశాబ్దం కన్నా ముందు నుంచే అమెరికా, చైనా ఓ ఆర్థిక బంధం మోడల్‌ను సృష్టించుకున్నాయి. గత శతాబ్దం చివరి దాకా కొనసాగిన అమెరికా-జపాన్ ఆర్థిక బంధం ‘నిషిబీ’తో దీన్ని ఫెర్గసన్ పోల్చారు.

కానీ, ‘చిమెరికా’ వట్టి ‘చిమెరా’ (గ్రీకు కథల్లో సింహం తల, మేక శరీరంతో ఉండే జంతువు) అని కరోనావైరస్ తేల్చింది.

ప్రపంచం నుంచి వాస్తవాలు దాస్తూ, వైరస్ తమ సరిహద్దులు దాటి మహమ్మారిగా మారేలా చేసిందని చైనా నాయకత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. చైనా చెబుతున్న విషయాలను సవాలు చేస్తున్నారు. ఆ దేశం ఇస్తున్న సమాచారాన్ని ప్రశ్నిస్తున్నారు.

చైనాలో 82వేల మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని, వారిలో 4,500 మంది చనిపోయారని అక్కడి ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, చైనాలో ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య 29 లక్షల దాకా ఉండొచ్చని వాషింగ్టన్‌లోని డెరెక్ సిస్సర్ ఆఫ్ ద అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది.

‘డ్రాగన్ దేశం పాటించే మూడు సూత్రాలు’

కొన్ని దేశాలు సంప్రదాయ మార్గాలను అనుసరించవు. వాటిలో చైనా ఒకటి. అది ‘చారిత్రక అనుభవం’ అనే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ రోజుల్లో అదేమైనా కావొచ్చు. కానీ, 1949లో మావో అధికారం చేజిక్కించుకునేందుకు తోడ్పడిన సుదీర్ఘ విప్లవం నుంచి వచ్చిందే అది.

ప్రపంచంపై చైనా దృక్కోణాన్ని ప్రధానంగా మూడు సూత్రాలు నిర్దేశిస్తాయి. అవే జీడీపీఇజం, చైనా సెంట్రిజం, చైనా ఎక్సెప్షనలిజం. ఇవన్నీ చైనా విప్లవం నుంచి వచ్చినవే.

‘‘ఆర్థిక అభివృద్ధే అత్యంత ప్రధానమైన తర్కం’’ అని 1980ల్లో డెంగ్ షియో పింగ్ ప్రకటించారు. దీన్ని చైనీస్ ఆర్థికవేత్తలు ‘జీడీపీఇజం’ అన్నారు.

రెండోది చైనా సెంట్రిజం. స్వాతంత్య్రం, స్వయం ప్రతిపత్తి, స్వయంసమృద్ధికి మావో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వాంగ్ షెన్ రాసిన ‘గెచాంగ్ జుగువో’ – మాతృభూమి గేయం చైనాలో అందరికీ తెలుసు. పర్వతాలు, మైదానాలు, నదులను వర్ణిస్తూ, ‘గొప్పదైన అందమైన ఈ చైనా నేలే మన ఇల్లు’ అని ప్రకటించే ఈ పాటను ఆ దేశ పౌరులందరూ గట్టిగా నమ్ముతారు.

మూడోది చైనా ఎక్సెప్షనలిజం. చైనా ఇతరుల నుంచి నేర్చుకోవడాన్ని నమ్మదు. విప్లవ సమయంలో మావో చెప్పిన ‘అభ్యసించు. అమలు చేయి’ సూత్రాన్ని పాటిస్తుంది. సమస్యలను సొంత జ్ఞానంతోనే పరిష్కరించుకోవాలి అనే దాన్ని అక్కడి నాయకులు బలంగా చెబుతారు.

‘నాజీ జర్మనీ సమయంలోనూ ఇంతే’

చారిత్రక సారూప్యతలున్నంత మాత్రాన ఒకేలా జరుగుతాయని కాదు. కానీ, చైనా జాతీయవాద దృక్పథానికి, రెండో ప్రపంచ యుద్ధానికి ముందటి జర్మనీ తీరుకు సారూప్యతలు కనిపిస్తాయి.

1930ల్లో జాత్యహంకారం, చరిత్ర గురించి వాదనలు, ఆర్యన్ ఎక్సెప్షనలిజం గురించి అందరికీ తెలుసు. కానీ, అప్పుడు చాలా దేశాలు ఏ సమస్యా లేదన్నట్లుగానే వ్యవహరించాయి.

ఒకప్పుడు చెకోస్లోవేకియాలో భాగంగా ఉండే సడెటెన్లాండ్ ప్రాంతాన్ని హిట్లర్ ఆక్రమించినప్పుడు యూరప్ హిట్లర్‌ను ఎదుర్కోవాల్సింది పోయి, బుజ్జగించాలని నిర్ణయించుకుంది. అక్కడితో హిట్లర్ ఆగిపోయేలా ‘మ్యునిచ్ ఒప్పందం’ కుదుర్చుకుని, బ్రిటన్ లాంటి యూరప్ దేశాలు సంబరాలు చేసుకున్నాయి.

(The article was originally published by BBC News on April 23, 2020. Views expressed are personal.)

Published by Ram Madhav

Member, Board of Governors, India Foundation

Debate, without Demonising

Debate, without Demonising

April 23, 2020
RSS at 100

RSS at 100

April 23, 2020

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

nineteen + sixteen =